శేరిలింగంపల్లి, జూన్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): యాదవకులస్తులైన ముకుట్ మణి యాదవ్, అతని శిష్యుడు సంత్ సింగ్ యాదవ్ అనే ఇద్దరిని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లాలోని దాదర్పూర్ గ్రామ బ్రాహ్మణులు తీవ్రంగా హింసించి అవమానించారు. ఈ సంఘటనకు బాధ్యులైన బ్రాహ్మణులను కఠినంగా శిక్షించాలని విసికే పార్టీ, అఖిల భారత యాదవ మహాసభ, పలు యాదవ ప్రజా సంఘాలు లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉత్తర ప్రదేశ్ లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రకుల దాడులు పెరిగిపోయాయి. యాదవులు అధిక సంఖ్యలో వున్నారు. రాజకీయంగా చైతన్యవంతులు. అయినా కూడా బ్రాహ్మణ వర్గాలు యాదవుల మీద దాడులకు పాల్పడుతున్నారని పలువురు నాయకులు అన్నారు.
ఇటావా జిల్లాలోని ఆహిర్పూర్ వాసులైన ముకుట్ మణి యాదవ్ గొప్ప పురాణ కథకుడు. భాగవత పురాణం రాగయుక్తంగా ఆలపిస్తూ ప్రజలకు వివరిస్తాడు. ఆయన కథా నైపుణ్యం గురించి తెలుసుకున్న దాదర్పూర్ గ్రామ బ్రాహ్మణులు జూన్ 21 వ తేదీ శనివారం భాగవత పురాణం చెప్పడానికి ఆహ్వానించారు. ఆయన తన శిష్యుడు సంత్ సింగ్ యాదవ్ ను తోడుగా తీసుకొని దాదర్పూర్ లో పురాణం చెప్పారు. ఆ తర్వాత ఈ ఇద్దరు యాదవ కులస్తులని తెలుసుకున్న బ్రాహ్మణులు ఆగ్రహించారు. సనాతన హిందూ ధర్మం ప్రకారం బ్రాహ్మణులకు మాత్రమే భాగవత పురాణ కథలు ప్రవచించే అధికారం వున్నదని, శూద్రులైన యాదవులు ధర్మాన్ని అతిక్రమించారని ఆరోపిస్తూ ఆ ఇద్దరిని చితకబాదారు.
వారిద్దరికి అరగుండు కొట్టించారు. అర మీసం తీసేశారు. ముక్కు నేలకు రాయించారు. వారి బట్టలు చింపేశారు. ఆ వూరి బ్రాహ్మణుల కాళ్లకు మొక్కించి క్షమాపణ చెప్పించారు. బ్రాహ్మణ మహిళ మూత్రం వాళ్లిద్దరి మీద పోశారు. ఈ దుర్మార్గం శనివారం రాత్రి మొదలై ఆదివారం వరకు కొనసాగుతూనే వున్నది. ఈ దుర్మార్గమైన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్ లోని యాదవ ఆహిర్ సామాజిక వర్గం తీవ్రంగా స్పందించింది. వేలాది మంది దాదర్పూర్ కు బయల్దేరారు. పోలీసులు గురువారం నిరసన తెలుపుతున్న యాదవుల మీద లాఠీ ఛార్జీ చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఇంత జరిగినా స్థానిక ముఖ్యమంత్రి యోగి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విసికె పార్టీ, అఖిల భారత యాదవ మహాసభ, ఇతర యాదవ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో డా.జిలుకర శ్రీనివాస్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం అధ్యక్షుడు గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్, రాష్ట్ర యువజన కార్యదర్శి యేషాం మల్లేష్ యాదవ్, నుచ్చు శివ యాదవ్, బత్తుల మనోజ్ యాదవ్ , గైరబోణీ నితిన్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం విజయ్ యాదవ్, యువజన ఉపాధ్యక్షుడు ఎలామెలా శ్రీనివాస్ యాదవ్, యువజన ప్రధాన కార్యదర్శి జి త్రిణై యాదవ్, నాయకులు రాజశేఖర్ యాదవ్, ప్రవీణ్ యాదవ్, యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లాడి శరత్ యాదవ్, తోకల మహేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, గొర్రె మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్ యాదవ్, ఓయు జేఏసి నాయకులు టి నవీన్ యాదవ్, పృథ్విరాజ్ యాదవ్, సిద్దేశ్వర్, మేకపోతుల నరేందర్, నవీన్ యాదవ్, రాజారాం యాదవ్, వాసు యాదవ్, మందాల భాస్కర్, దత్తాత్రేయ, అశోక్ యాదవ్, ఆజాద్, భద్రీ తదితరులు పాల్గొన్నారు.