శేరిలింగంపల్లి, జూన్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): మతి స్థిమితం లేని ఓ మహిళ భవనంపై నుంచి కిందకు దూకి మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుము అనే గ్రామానికి చెందిన బురద ప్రసాద్ 17 ఏళ్ల కిందట బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి స్థానికంగా చందానగర్ పాపిరెడ్డి కాలనీలోని ఆరంభ్ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య పాలకొండ కుమారి (33), కుమారుడు ప్రశాంత్ కుమార్, కుమార్తె రియాంశిక ఉన్నారు. కుమారుడు 10వ తరగతి చదువుతుండగా, కుమార్తె 3వ తరగతి విద్యను అభ్యసిస్తోంది. కాగా ప్రసాద్ భార్య కుమారికి గత 3 సంవత్సరాల నుంచి మతి స్థిమితం ఉండడం లేదు. ఈ క్రమంలోనే జూన్ 28వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో ఆమె తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకింది. తీవ్రగాయాల పాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.