శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యార్థుల భవిష్యత్తుపై దాడి జరుగుతోందని, పరీక్షల పారదర్శకతను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి రామకృష్ణ అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన 2026 నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న దారుణ ఘటన అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆశలపై ఈ అవినీతి మాఫియా గుంపులు దాడి చేయడం అత్యంత ఖండనీయమని, ప్రభుత్వాల నిర్లక్ష్యం, పరీక్షల నిర్వహణలో లోపాలు, ప్రైవేట్ కోచింగ్ మాఫియాలతో ఉన్న సంబంధాల వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల పేపర్ లీక్ కావడం దేశ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై, పేపర్ లీకేజీ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పరీక్షను రద్దు చేసి, పూర్తి పారదర్శకతతో మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.






