అమరుల త్యాగాలు మరువలేనివి: సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

  • పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్, వివిధ పోలీస్ స్టేషన్ లలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఓపెన్ హౌజ్
  • రక్తదానం చేసిన సీపీ వీసీ సజ్జనార్, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల
  • రక్తదానం మహాదనం, రక్తదానంపై అపోహలు వద్దు: సీపీ
  • మొత్తం 569 యూనిట్ల రక్త సేకరణ
  • అమరవీరుల సంస్మరణ దినోత్సవ ప్రారంభం నుంచి
    743 యూనిట్ల రక్త సేకరణ

సైబ‌రాబాద్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగలను స్మరిస్తూ సైబరాబాద్‌ పోలీస్ కమీషనరేట్ లో ‘’మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్’’, ఓపెన్ హౌజ్, వివిధ పోలీస్ స్టేషన్లలో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేసి మంగ‌ళ‌వారం మొత్తం 569 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఇందులో పోలీసు సిబ్బంది 336 యూనిట్లు, ప్రజలు 233 యూనిట్ల రక్త దానం చేశారు. అక్టోబర్ 21 సంస్మరణ దినోత్సవం రోజు నుంచి మొత్తంగా 743 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

శిబిరంలో ర‌క్త‌దానం చేస్తున్న సీపీ వీసీ స‌జ్జ‌నార్

సైబరాబాద్‌ పోలీస్ కమీషనరేట్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్ క్యాంప్ ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్యాంప్ కి విచ్చేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అసువులు భాసిన పోలీస్ అమరవీరులకు జోహార్లు ఆర్పిస్తూ వారి కుటుంబాలకు పోలీస్ శాఖ తర‌పున ప్రగాఢ‌ సంతాపన్ని ప్రకటించారు. అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారన్నారు. వారి త్యాగాలకు వెలకట్టలేమన్నారు.

ప్రతి ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. అమరుల త్యాగ ఫలంగానే ఈరోజు దేశం, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారన్నారు. ప్రజలకు పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని, పోలీసులు లేని సమాజాన్ని మనం ఊహించలేమన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. సమాజంలో ఎవరికేం కష్టమొచ్చినా పోలీసులు ముందు వరసలో ఉండి వారి ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షిస్తారన్నారు. ఇటీవల వచ్చిన కరోనా కావచ్చు, వరదలు కావచ్చు.. పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలను అందించారు. తెలంగాణ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు చేపట్టిన అన్ని కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయడంలో అమోఘమన్నారు.

త‌లసేమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషెంట్లు, బ్లడ్‌ కేన్సర్‌ రోగులు, హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, తదితర జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని సీపీ అన్నారు. రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దని సైబరాబాద్ సీపీ అన్నారు. కరోనా సమయంలో సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఎస్సీఎస్సీ వాలంటీర్లు, వివిధ ఎన్జీఓలు, కమ్యూనిటీలు ముందుకు వచ్చి పెద్దఎత్తున సహాయక కార్యక్రమాలు చేప‌ట్టడంతో పాటు రక్త దాన‌ శిబిరాలను ఏర్పాటు చేసి సుమారుగా 5500 యూనిట్ల బ్లడ్ ను సేకరించి బ్లడ్ బ్యాంక్ ల సాయంతో అవసరం ఉన్నవారిని ఆదుకున్నామన్నారు. పెద్ద ఎత్తున రక్త దానం చేసేందుకు ముందుకు వచ్చిన కొత్తగా రిక్రూట్ అయిన పోలీస్ సిబ్బంది, ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ర‌క్త‌దానం చేసిన వారికి ప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న సీపీ వీసీ స‌జ్జ‌నార్

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, నీలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, తలసేనియా సికిల్ సెల్ సొసైటీ వారికి, గాంధీ హాస్పిటల్, ఎమ్ఎన్ జె క్యాన్సర్ హాస్పిటల్, నిమ్స్ ఆసుపత్రి, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల, ఎస్సీఎస్సీ వాలంటీర్లు ధన్యవాదాలు తెలిపారు.

140 సార్లు రక్తదానం చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ (మహబూబ్ నగర్) డాక్టర్ నటరాజన్ ని, 12 సార్లు ప్లాస్మాదానం చేసిన డాక్టర్ సంపత్ కుమార్ ను సీపీ సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేశారు. రక్తదానం చేసిన ఇతరులకు సీపీ ప్రశంసాపత్రాలను అందజేశారు.

సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల రక్తదానం చేశారు. అనంతరం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల మాట్లాడుతూ సైబరాబాద్ పోలీసులతో కలిసి ఎస్సీఎస్సీ అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. అడిగిన వెంటనే ఇంత తక్కువ సమయంలో పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన సైబరాబాద్ పోలీసులు, ఎస్సీఎస్సీ వాలంటీర్లకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లోనూ ఈ రక్తదాన శిబిరాలు ఉంటాయన్నారు.

అనంతరం సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్ మాట్లాడుతూ మంగ‌ళ‌వారం మొత్తం 5 చోట్లలో.. సైబరాబాద్ సీపీ పరేడ్ గ్రౌండ్, గచ్చిబౌలి లా అండ్ ఆర్డర్, గచ్చిబౌలి ట్రాపిక్ పోలీస్ స్టేషన్, శంషాబాద్ పోలీస్ స్టేషన్, ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్, బాలానగర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, బాలానగర్ ట్రాపిక్ పోలీస్ స్టేషన్లలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు.

ఓపెన్ హౌజ్‌లో భాగంగా ఆయుధాల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన దృశ్యం

ఈ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ (సీఎస్డబ్ల్యూ) వెంకట్ రెడ్డి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మి నారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ సంతోష్ కుమార్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ (మహబూబ్ నగర్) డాక్టర్ నటరాజన్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్ వి విజయశాంతి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి డాక్టర్ అనూరాధ, నీలోఫర్ ఆసుపత్రి డాక్టర్ ఎన్ సుధీర్ బాబు, త‌లసేనియా సికిల్ సెల్ సొసైటీ వలంటీర్ మహేశ్, గాంధీ హాస్పిటల్ డాక్టర్ సునీత, ఎమ్ఎన్ జె క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ లక్ష్మి, నిమ్స్ ఆసుపత్రి డాక్టర్ శాంతి, సి‌టి‌సి డాక్టర్ సుకుమార్, సి‌టి‌సి డాక్టర్ సరిత, సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ ఇన్ స్పెక్టర్లు, ట్రాఫిక్ సిబ్బంది, సీపీ ఆఫీసు సెక్షన్ల సిబ్బంది, ఆర్ఐలు, ఎస్సీఎస్సీ వాలంటీర్లు పాల్గొన్నారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ‘ఓపెన్ హౌజ్’…

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని మెయిన్ కాన్ఫరెన్ హాల్లో ఆన్ లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓపెన్ హౌజ్ లో భాగంగా వివిధ పోలీస్ ఆయుధాలను ప్రదర్శించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here