
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులకు తమ పార్టీ పునాదులు కదులుతున్న భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర విపత్తుల నివారణ కమిటీ కన్వీనర్ కసిరెడ్డి భాస్కర రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులపై ఆయన మాట్లాడారు. దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేపిన రాజకీయ సెగ రాష్ట్రమంతటా పాకిందన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే బిజెపి అభ్యర్థి ఇల్లు, బంధువుల ఇండ్లతో పాటు ఎన్నికలకు సంబంధం లేని సిద్ధిపేట ప్రాంతంలో సైతం నిబంధనలకు వ్యతిరేకంగా తనిఖీలు చేయిస్తున్నారన్నారు. ప్రధాన రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పట్ల సిద్ధిపేట సీపీ అనాగరికంగా వ్యవహరించడం దారుణమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తుందని, ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముందస్తు అరెస్టులు చేపట్టారన్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, దుబ్బాక ఎన్నికలతో పాటు రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు గుణపాఠం తప్పదన్నారు.





