శేరిలింగంపల్లి, మే 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్‌లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ స్థానికులతో కలిసి బీఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ సోమవారం జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపీ నగర్‌లో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. కాలువలు మూసుకుపోవడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని, వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అన్నారు. దీని వల్ల డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుందని, దుర్వాసన వస్తుందని, అంటు వ్యాధులు వ్యాప్తి చెంది ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






