శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): కల్లుగీత వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్న గౌడ్, పలువురు గౌడ సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కల్తీకల్లు పేరుతో అక్రమ కేసులు బనాయించి హైదరాబాద్‌లో మూసివేసిన కల్లు దుకాణాలను తక్షణమే తెరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాలు, పెరుగు, అల్లం, కారం తదితర అనేక వస్తువులు కల్తీ అవుతున్నాయని, యూరియాతో కల్తీ పాలను తయారు చేస్తున్న వారిని తక్షణం అరెస్ట్ చేయాలని అన్నారు. ఈనెల 14న మద్యం పాలసీ పేరిట 93 జీవోను విడుదల చేసిందని, తక్షణమే జీవోను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లు గీత సొసైటీలకు వైన్స్, బార్ల కేటాయింపులో 25 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, మూతపడిన కల్లు దుకాణాలను వెంటనే తెరవాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టాలని, తాటి చెట్లపై నుండి పడి మరణించిన శాశ్వత వికలాంగలకు కల్లుగీత వృత్తిదారుల పెండింగులో రూ.13 కోట్ల ఎక్స్ గ్రేషియాను తక్షణమే చెల్లించాలని, రూ 10 లక్షలు ఇవ్వాలని, ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని కేటాయించి తాటి, ఈత వనాలను పెంచాలన్నారు.

ఈ కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, బీసీ సంఘాల నాయకులు ఎస్. దుర్గయ్య గౌడ్, బైరు శేఖర్, జీబిఎన్ చీకటి ప్రభాకర్ గౌడ్, బత్తిని కీర్తిలతా గౌడ్, సింగం నాగేశ్వర్ గౌడ్, రెస్టారెంట్ అండ్ బార్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ గౌడ్, గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్, ముత్యం ముఖేష్ గౌడ్, గజ్జే శ్రీనివాస్ గౌడ్, బబ్బూరి భిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





