శేరిలింగంపల్లి, నవంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజావసరాల కోసం ఖాళీగా వదిలేసిన స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని, వెంటనే అక్రమ నిర్మాణదారుడిపై చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి బీసీ జేసీ నాయకుడు ముద్దంగుల మల్లేష్ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం చందానగర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డీసీ శశిరేఖకు ఫిర్యాదు చేశారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని హఫీజ్ పేట డివిజన్ మదీనాగూడ గ్రామం వీకర్ సెక్షన్ కాలనీకి ఆనుకుని ఉన్న ఆర్కెడో ఇంపిరియో అనే అపార్ట్‌మెంట్ ఎదుట సెట్ బ్యాక్, అపార్ట్ మెంట్ వాసుల అవసరాల కోసం ఖాళీగా వదిలేసిన సుమారు 70 గజాల స్థలంలో ఓ వ్యక్తి 3 అంతస్తుల కమర్షియల్ భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నాడని ఈ సందర్భంగా మల్లేష్ తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చేయాలని, సదరు వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేకపోతే గ్రామస్తులతో కలిసి చందానగర్ సర్కిల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడుతామని హెచ్చరించారు.






