శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పార్కు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని దొంగ ఎల్ఆర్ఎస్ చేసుకోవడంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పలు కాలనీవాసులతో కలిసి సోమవారం జోనల్ కార్యాలయం, డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఫ్రెండ్స్ కాలనీ, డిఫెన్స్ కాలనీ, అర్జున్ రెడ్డి కాలనీల నడుమ ఉన్న పార్కును కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, ఇప్పటికే పార్క్ స్థలాన్ని సర్వే నంబర్ 125లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, సర్వే నంబర్ 267లో దొంగ ఎల్ఆర్ఎస్ కూడా చేసుకున్నారని తెలిపారు. దీనిపై అనేక సార్లు కాలనీవాసులు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని అన్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని దొంగ ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని, పార్కు స్థలాన్ని రక్షించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో డిఫెన్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రసాదరాజు, కృష్ణారావు, కుమారస్వామి, మహేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.






