- పార్లమెంట్‌లో ఎంపీ రంజిత్ రెడ్డి వినతి
మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ లోని నడిగడ్డ తండా దగ్గర ఏర్పాటు చేసిన “సీఆర్పీఎఫ్ క్యాంప్” ను వెంటనే తొలగించాలని చేవెళ్ల ఎంపి డాక్టర్ రంజిత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని శనివారం ఢిల్లీలో జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి ఇదే విషయాన్ని తీసుకెళ్లారు. తన చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మియాపూర్ గ్రామంలో ఉన్న నడిగడ్డ తండా సుభాష్ చంద్రబోస్ నగర్ లో సుమారుగా 1,400 కుటుంబాలు సర్వే నెంబర్ 28 /A లో 50 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడ్డాయని వివరించారు. 2016లో సిఆర్పిఎఫ్ అక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేసిందని, ఈ ప్రాంతంలో జరిగే కార్యకలాపాలను అడ్డుకోకూడదని, సిఆర్పిఎఫ్ తన శిబిరానికే పరిమితం అవుతుందని సిఆర్పిఎఫ్ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

అయితే కొన్ని నెలల క్రితం సిఆర్‌పిఎఫ్ సిబ్బంది పేద గిరిజనులను వేధించడం మొదలుపెట్టారని, వారి రాకపోకలను నిరోధించారని తెలిపారు. ఈ తండాలకు బాత్‌రూమ్‌లు నిర్మించడానికి ఉపయోగించే ముడిసరుకును కూడా అనుమతించడం లేదని ఆయన తెలిపారు. చెక్ పోస్టులు, చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారని, నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి ఆయుధాలతో తాండా చుట్టూ తిరుగుతూ కొన్ని సమయాల్లో శారీరకంగా దాడులు చేయడం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఈ శిబిరాన్ని వేరే చోటుకు తక్షణమే మార్చాలని అన్నారు. ఇందుకోసం సిఆర్‌పిఎఫ్ డిజికి తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.