శేరిలింగంపల్లి, జనవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో శ్రీదేవి థియేటర్ అమీన్‌పూర్ రోడ్ ను మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నవతా రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్ అలసత్వం , అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేమి క్షుణ్ణంగా కనిపిస్తుందని, శ్రీదేవి థియేటర్ అమీన్‌పూర్ రోడ్ నాసిరకంగా నిర్మిస్తున్నారని అన్నారు. మట్టి తీయకుండా, మొరం పోయకుండా పాత రోడ్డు మీదనే నాసిరకం డస్ట్ పోసి రోడ్డును నిర్మిస్తున్నారని, నత్తనడక రోడ్డు పనుల వలన వేలాది మంది ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాత రోడ్ తీయకుండానే కొత్త రోడ్ వేయటం వలన రోడ్ కు ఇరువైపుల ఉన్న ఇళ్లు గుంతల మయంగా మారుతున్నాయి అని, TV చానెల్స్ వారి కెమెరాలు ఒక సారి శ్రీదేవి థియేటర్ అమీన్‌పూర్ రోడ్ వైపు చూపించాలని కోరారు. రోడ్ నిర్మాణం ప్రజల సౌకర్యం కోసమా, లేక ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసమా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ , అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వలన ఇంటి యజమానులు, వాహనదారులు నరక యాతన పడుతున్నారని అన్నారు. శ్రీదేవి థియేటర్ అమీన్‌పూర్ 150 ఫీట్ రోడ్డుని అధికారుల పర్యవేక్షణలో, నాణ్యత తో త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.డి సలీం, చందర్ రావు, గౌస్, రామా రావు, విజయ్, బాబా, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






