కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

  • రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాకు జీవో విడుదల చేయాలి
  • జనగామకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి
  • తెలంగాణ‌ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత వృత్తిని నిర్బంధించిందని, కల్లుగీత సొసైటీల ప్రతినిధులపై కేసులు బనాయిస్తూ దాడులు చేస్తున్నదని తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు ప్రభుత్వ సహకారం లేక, మరోవైపు తమ వృత్తికి రక్షణ లేక కల్లుగీతవృత్తిదారుల జీవనం ఆగమ్యగోచరంగా మారిందని పేరొన్ననది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గీతకార్మికులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేతకు జీవో తేవాలని, జనగామ జిల్లాకు సర్వాయి పాపన్నగా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వైన్ షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్ల జీవో తీసుకురావాలని, కోహెడలోని గౌడ ఆత్మగౌరవ భవనం పనులు ప్రారంభించాలని కోరింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరై కమిటీ చైర్మన్ బాలగోని బాల‌రాజ్ గౌడ్, అయిలి వెంకన్నగౌడ్ లతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను ధ్వంసం చేసిందని మండిపడ్డారు. రెండేళ్లలో 751 మంది గీత కార్మికులు వృత్తిరీత్యా చెట్ల మీదికెళ్లి పడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కానీ వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదన్నారు. తూతూమంత్రంగా రూ.5లక్షలిచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నదని, ఇచ్చిన మాట ప్రకారం రూ.10లక్షలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కొలేక తమ వృత్తులపై ఆధారపడుతున్న వారిపై కేసులు, దాడులు చేయిస్తూ ఇంకా కులవృత్తులను ప్రభుత్వం బలహీనపరుస్తుందన్నారు. ఫుట్‌బాల్ , అందాల పోటీలకు వందల కోట్ల రూపాయలు వ్యయం చేసిన ప్రభుత్వం మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 కోట్లు ఇవ్వకపోవడంపై కల్లు గీత వృత్తిపై ప్రభుత్వ వైఖ‌రికి అద్దం పడుతుందని ధ్వజమెత్తారు. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలన్నారు. కల్లుగీత వృత్తి రక్షణే కాదు. అన్ని కులవృత్తులను కాపాడాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

బాలగోని బాల‌రాజ్ గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత వృత్తిమీద నార్కొటిక్, పోలీసుల దాడులు, కేసులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. అనేక ఉత్పత్తులు తయారుచేస్తూ అంతర్జాతీయంగా వ్యాపారం చేసేందుకు అవకాశమున్న నీరా భవనాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కల్లు అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐలి వెంకన్నగౌడ్ మాట్లాడుతూ కల్లుగీత వృత్తి పరిరక్షణ కు బలమైన ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కుల వృత్తుల సమస్యలకు రాజ్యాధికారం పరిష్కారమని, ఆ దిశగా బిసిలంతా ఒక్కటై పోరాడాలన్నారు. సమావేశంలో గౌడ సంఘాల ప్రతినిధులు అంబాల నారాయణ గౌడ్, దుర్గయ్య గౌడ్, వీరస్వామి ప్రజాకర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, గడ్డమీది విజయ కుమార్ గౌడ్, జిల్లాల నేతలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here