శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్లో రహదారులు అధ్వాన్నంగా మారాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు గుంతలమయంగా మారినా జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ మాట్లాడుతూ రోజూ ఈ ప్రాంతంలో ప్రయాణించే వేలాది మంది ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దెబ్బతిన్న రోడ్ల కారణంగా ప్రజలు శారీరకంగా, ఆర్థికంగా నష్టపోతుండగా, వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఐటీ కారిడార్‌కు కీలక ప్రాంతమైన కొండాపూర్‌లో రోడ్ల పరిస్థితి ఈ స్థాయికి దిగజారడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

అధికారులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన డివిజన్లోని అన్ని గుంతలను పూడ్చి, శాశ్వత రహదారి మరమ్మత్తు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రాబోయే మూడు నుంచి ఐదు రోజుల్లో రోడ్ల పరిస్థితిలో మార్పు కనిపించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలు, వాహనదారులతో కలిసి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట భారీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని, లేకపోతే ఏర్పడే ప్రజా ఆగ్రహానికి వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్, డాక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.





