నడిగడ్డ తాండ సమస్యలపై ఉప కమిషనర్‌కు వినతి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నడిగడ్డ తాండలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నడిగడ్డ తాండ గిరిజన సంక్షేమ సంఘం కమిటీ ఆధ్వర్యంలో మాదాపూర్ సర్కిల్-50 ఉప కమిషనర్ బాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో తాండలోని ప్రధాన సమస్యలను వివరించారు. ప్రస్తుతం ఉన్న వీధి దీపాలు సరిగా వెలగకపోవడంతో రాత్రి వేళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొత్త విద్యుత్ దీపాలు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే తాండలోని ప్రధాన రహదారులు, పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ శానిటేషన్ సిబ్బందికి పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోతోందని, దీంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అదేవిధంగా తాండలోని ప్రధాన వీధుల్లో కొత్త సీసీ రోడ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. వినతిని స్వీకరించిన ఉప కమిషనర్ బాలకృష్ణ సమస్యలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని సానుకూలంగా స్పందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తాండ గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు సభవత్ హన్మ నాయక్, ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, కమిటీ సభ్యులు గోవిందు సుధాకర్, దేవనూర్ నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here