శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 దేవాలయాలకు రూ.30.71 లక్షల ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధుల చెక్కులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆలయ ధర్మకర్తలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేశారని, అందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 92 దేవాలయాలకు రూ.30.71 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు తదితర అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేపడుతున్నామని తెలిపారు. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అందించిన నిధులు బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉపయోగపడతాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆరెకపూడి గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.





