శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ్ నగర్, ప్రగతి ఎన్క్లేవ్ కాలనీల పార్కుల్లో మొక్కల సంరక్షణ, పచ్చదన పరిరక్షణకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన నూతన బోర్‌వెల్స్‌ను మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండారు మోహన్ ముదిరాజ్, అట్టేపల్లి రామ ప్రభు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ పార్కులు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా పర్యావరణ సమతుల్యత, ప్రజల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తుకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. పార్కుల్లో నాటిన మొక్కలను ఏడాది పొడవునా సంరక్షించేందుకు నీటి వసతి అత్యంత అవసరమని, ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని బోర్‌వెల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ బోర్‌వెల్స్ ద్వారా పార్కుల్లోని మొక్కలకు నిరంతరం నీటి సరఫరా అందించి పచ్చదనాన్ని మరింత పెంపొందించవచ్చని ఆయన అన్నారు. అభివృద్ధి పనులు ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతాయని పేర్కొంటూ, కాలనీ వాసులు పార్కులను తమ సొంత ఆస్తిగా భావించి పరిశుభ్రత, మొక్కల సంరక్షణలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్లోని ప్రతి కాలనీలో పచ్చదనం పెంపొందించేందుకు, పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు నిరంతరం కృషి చేస్తామని శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ్ నగర్‌కు చెందిన మోహన్ రావు, మహేశ్వర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వెంకట్రావు, సీతాకుమారి, మంజుల, ప్రగతి ఎన్‌క్లేవ్‌కు చెందిన చంద్రహాస్, రాములు, దయాకర్, వినీత్, నాయుడు, యూబీడీ సూపర్వైజర్ కుర్మయ్యతో పాటు పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు.





