“శేరిలింగంప‌ల్లిలో సీఎం స‌భ ఫ్లాప్‌.. ఎమ్మెల్యే వైఫ‌ల్యం చెంది ప్ర‌తిప‌క్షాల‌ను విమ‌ర్శించ‌డం స‌రికాదు..”

  • గాంధీ రాజ‌కీయ అవ‌కాశ‌వాది
  • బీఆర్ఎస్ క్రెడిట్‌ను కాంగ్రెస్ కు ఇవ్వ‌డం సిగ్గు చేటు
  • ద‌మ్ముంటే రాజీనామా చేసి మ‌ళ్లీ గెల‌వాలి
  • పీఏసీ చైర్మ‌న్‌, ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీకి న‌వ‌తా రెడ్డి స‌వాల్‌

శేరిలింంగ‌ప‌ల్లి, జూన్ 9 (న‌మ‌స్తే శేరిలింంగ‌ప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న అభివృద్ధి పనుల శంకుస్థాపన సభ పూర్తిగా విఫలమైందని, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే స్థానిక ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకురాలు బొబ్బ నవతా రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజల తీర్పు తీసుకోవాలని ఆమె సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి సభకు ప్రజలు ఆశించిన స్థాయిలో హాజరు కాకపోవడం, వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కల్పించలేకపోవడం ఎమ్మెల్యే గాంధీ వైఫల్యమని ఆరోపించారు. సభకు ప్రజలు రాకపోవడానికి బీఆర్‌ఎస్ నాయకులు గడియారాలు పంపిణీ చేయడమే కారణమని సీఎం ముందే చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. గత రెండు నెలలుగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తదితర బీఆర్‌ఎస్ నాయకుల ఫోటోలతో గడియారాలను పంపిణీ చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నామని, ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఎమ్మెల్యే గాంధీ అసహనానికి గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు.

ఎమ్మెల్యే గాంధీ రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావించిన నవతా రెడ్డి, టీడీపీ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరడం, అనంతరం కాంగ్రెస్‌కు దగ్గరవడం ఆయన రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని విమర్శించారు. అధికారంలో ఉన్న పార్టీకే మద్దతుగా నిలవడం, ఆ పార్టీ నాయకత్వాన్ని పొగడడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. 2018, 2023 ఎన్నికల సమయంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేశానని చెప్పిన గాంధీ, ఇప్పుడు అదే అభివృద్ధి క్రెడిట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగిస్తూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పార్టీ పేరును ప్రస్తావించే అర్హత కూడా ఆయనకు లేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ హయాంలో హైదరాబాద్‌లో అనేక ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించగా, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు ఫ్లైఓవర్లను ప్రారంభించి భారీ ప్రచారం చేసుకుంటోందని నవతా రెడ్డి విమర్శించారు. రూ.800 కోట్ల విలువైన పనులను రూ.2 వేల కోట్లుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

శేరిలింగంపల్లికి సంబంధం లేని శంకర్‌పల్లి, ఓఆర్ఆర్, కొల్లూరు, బాచుపల్లి ప్రాంతాల అభివృద్ధి పనులను కూడా నియోజకవర్గ విజయాలుగా చూపించడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. చందానగర్‌లో వివిధ వర్గాల సంఘాలకు స్థలాల కేటాయింపు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని, ఇప్పుడు వాటి క్రెడిట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం సరికాదన్నారు. గతంలో ప్రకటించిన 700 పడకల ఆసుపత్రి, 50 ఎకరాల బస్ టెర్మినల్, మియాపూర్-బీహెచ్ఈఎల్ సింగిల్ పిల్లర్ మెట్రో, చెరువుల సుందరీకరణ, ఎస్టీపీ ప్లాంట్లు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి వంటి హామీల పరిస్థితి ఏమైందని నవతా రెడ్డి ప్రశ్నించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ కొత్త శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలే ఇప్పుడు ఎమ్మెల్యే గాంధీని చూసి వెక్కిరిస్తున్నాయని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here