మాతృశ్రీ నగర్‌లో బ్రహ్మకుమారీస్ హార్మనీ హైట్స్ కేంద్రం ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్‌లో ఏర్పాటు చేసిన హార్మోనీ హైట్స్ ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ‌హించారు. ఓం శాంతి ఇన్‌చార్జ్‌లు, బ్రహ్మకుమారిలు, కాలనీ వాసులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజయోగ ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక అవగాహన, అంతరంగిక శాంతి, నైతిక విలువల వ్యాప్తికి ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. వ్యక్తిగత శ్రేయస్సుతోపాటు సామాజిక అభివృద్ధికి దోహదపడుతున్న ఈ సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్ని విధాలా మద్దతు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఓం శాంతి అనేది ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థలో విస్తృతంగా ఉపయోగించే పవిత్ర ఆధ్యాత్మిక అభివాదమని, దీనికి లోతైన అర్థం, ఉద్దేశ్యం ఉందని అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ ఓం శాంతి అనే పదం మనం శరీరాలు కాదు, ఆత్మలమనే సత్యాన్ని గుర్తుచేస్తూ, మన అసలైన స్వభావం శాంతియేనని వివరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఓం పరమాత్మను, సర్వోన్నత ఆత్మశక్తిని, శాంతి, పవిత్రతల విశ్వ కంపనాన్ని సూచిస్తే శాంతి మనసుకు ప్రశాంతత, సమతుల్యత, సామరస్యాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.

 

ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక, విద్యాసంస్థగా రాజయోగ ధ్యానం ద్వారా వ్యక్తుల అంతరంగిక మార్పుకు దోహదపడుతూ ప్రపంచ శాంతి సాధనకు కృషి చేస్తోందని తెలిపారు. ఈ సంస్థ ధ్యానం, ఒత్తిడిని నియంత్రించడం, సంబంధాల మెరుగుదల, విలువల ఆధారిత జీవనశైలిపై ఉచిత శిక్షణలు, వర్క్‌షాప్‌లను అందిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్, నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here