శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ రాగం నాగేందర్ యాదవ్‌ను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాల పండుగను పురస్కరించుకుని రాగం నాగేందర్ యాదవ్ అభిమానులు, కార్యకర్తలు పలు ఆలయాల వద్ద భక్తులకు పండ్లు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. తారానగర్‌లోని శ్రీశ్రీశ్రీ తుల్జాభవాని అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా తారానగర్, గోపినగర్, నెహ్రూనగర్ తదితర ప్రాంతాల కాలనీవాసులు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అనంతరం ఎంఐజీలోని శ్రీ ఎల్లమ్మ ఆలయంలో స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్ సహకారంతో వైభవంగా అలంకరించిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజీవ్ గృహకల్పలో కాలనీవాసులు వేద పండితుల మంత్రోచ్ఛరణలు, పూర్ణకుంభ స్వాగతం, సన్నాయి మేళాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య మాజీ కార్పొరేటర్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన జన్మదిన కేక్‌ను రాగం నాగేందర్ యాదవ్ కట్ చేసి, కాలనీవాసుల అభినందనలు స్వీకరించారు. ఆ తర్వాత ఆర్జీకే ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు పొందారు. హుడా ట్రేడ్ సెంటర్‌లోని రామాలయం వద్ద భద్రకాళి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో కాలనీవాసులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. చందానగర్ వేముకుంటలోని అమ్మవారి ఆలయంలో మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రాగం నాగేందర్ యాదవ్‌ను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ఆయన ప్రజాసేవను కొనియాడుతూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరింత కాలం ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. శేరిలింగంపల్లి డివిజన్‌లో బోనాల వేడుకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ రాగం నాగేందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవే తన లక్ష్యమని, ప్రజల ఆశీస్సులతో డివిజన్ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.






