శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (నమస్తే శేరిలింగంపల్లి):గురు పూర్ణిమతోపాటు కందుల కూచిపూడి నాట్యాలయం 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శిల్పారామం, కందుల కూచిపూడి నాట్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో గురు వందనం–2026 కార్యక్రమాన్ని శిల్పారామం ఆంఫీథియేటర్‌లో ఘనంగా నిర్వహించారు. భారతీయ గురు–శిష్య సంప్రదాయానికి అంకితమైన ఈ కార్యక్రమంలో గురు రవి కూచిపూడి శిష్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయం, భక్తి, నృత్య నైపుణ్యం సమన్వయంతో సాగిన ప్రదర్శనలు భారతీయ శాస్త్రీయ నృత్య వైభవాన్ని ఆవిష్కరించాయి.

ఈ సందర్భంగా ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు డా. వేదాంతం సత్య నరసింహ శాస్త్రికి గురు వందనం సమర్పించి, శాస్త్రీయ నృత్య రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్తలు, నాట్య గురువులు, కళాకారులు, సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై నిర్వాహకులను అభినందించారు. వక్తలు మాట్లాడుతూ భారతీయ శాస్త్రీయ కళల పరిరక్షణతో పాటు గురు–శిష్య సంప్రదాయాన్ని భావితరాలకు అందించడం ప్రతి కళాకారుడి బాధ్యత అని పేర్కొన్నారు. యువతలో భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. కళాభిమానులు, తల్లిదండ్రులు, ఆహ్వానితులతో కళకళలాడిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమానికి సహకరించిన అతిథులు, కళాకారులు, తల్లిదండ్రులు, పోషకులు, ప్రేక్షకులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.





