బొమ్మ బల్బును మింగిన బాలుడు.. జాగ్రత్తగా తొలగించిన మెడికవర్ డాక్టర్లు..

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అనుకోకుండా బ‌ల్బును మింగిన ఓ బాలున్ని మాదాపూర్ మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ వైద్యులు ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం హాస్పిట‌ల్ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వైద్యులు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న ప్రకాశ్ తో  డాక్టర్ రఘుకాంత్

తెలంగాణ రాష్ట్రం మహబూబ్​నగర్​కు చెందిన ప్రకాశ్ అనే 9 ఏళ్ల బాలుడు అనుకోకుండా ఓ బొమ్మ‌ బ‌ల్బును మింగాడు. దీంతో ఆ బాలుడికి దగ్గు వ‌చ్చింది. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో అత‌ని అవ‌స్థ‌ను గుర్తించిన అత‌ని త‌ల్లిదండ్రులు అత‌న్ని స్థానికంగా ఉన్న ఓ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి వైద్యుల సూచ‌న మేర‌కు సిటీ స్కాన్ తీయించారు. దీంతో ఆ బాలుడి శ్వాస నాళంలో బ‌ల్బు ఉన్న‌ట్లు గుర్తించారు. దీంతో త‌ల్లిదండ్రులు ఆ బాలున్ని మాదాపూర్‌లోని మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌కు చికిత్స నిమిత్తం తీసుకువ‌చ్చారు.

మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ వైద్యులు అతనికి మత్తు ఇచ్చి పీడియాట్రిక్​ రిజిడ్​ బ్రాంకోస్పోపీ చేయాలని నిర్ణయించారు. సీనియర్​ కన్సల్టెంట్​ అండ్​ ఇంటర్​వెన్షినల్​ పల్మనాలజిస్ట్​ డాక్టర్ రఘుకాంత్ తో పాటు అనెస్థెటిస్ట్​ డాక్టర్​ విజయ్ లు క‌ష్ట‌ప‌డి ఆ బాలుడి శరీరంలో నుంచి బొమ్మ బల్బును తొలగించారు. అలాగే బల్బు అవశేషాలు ఇంకేమైనా ఉన్నాయో లేదో తెలసుకోవడానికి బ్రాంకోస్కోపీ ద్వారా పూర్తిగా పరిశీలించారు. బల్బును తొలగించాక ఆ బాలుడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు త‌లెత్త‌లేద‌ని వైద్యులు తెలిపారు. దీంతో అతన్ని డాక్టర్లు అదే రోజు హాస్పిటల్​ నుంచి డిశ్చార్జి చేశారు.

బాలుడి శ‌రీరంలో ఉన్న బొమ్మ బ‌ల్బు, బ‌య‌ట‌కు తీయ‌బ‌డిన బ‌ల్బు

సీనియర్​ కన్సల్టెంట్​ అండ్​ పల్మనాలజిస్ట్​ డాక్టర్​ రఘుకాంత్​ మాట్లాడుతూ పిల్లలు చిన్నవయసులో ఉన్నప్పుడు బొమ్మలు, ఆట వస్తువులను మింగడం సహజమే. కారణం, ఆ వయసులో వాళ్లకు చుట్టు పక్కనున్న పరిసరాల్లో కనిపించే వస్తువులు అవే. అందువల్ల వారు పొరపాటుగా వాటిని నోట్లో పెట్టుకుంటారు. చిన్నచిన్న వస్తువులను మింగుతుంటారు. దాంతో అవి ఊపిరితిత్తులకు చేరుతాయ‌ని చెప్పారు.

ఫారిన్​ బాడీ (బయటి వస్తువులు) లను పిల్లలు ఇలా మింగడం వల్ల తల్లిదండ్రులు భయాందోళనల‌కు గురవుతారు. కొన్ని సందర్భాల్లో మింగిన వస్తువులను తొలగించడంలో ఆలస్యమైతే.. అవి శ్వాసనాళాల్లోకి చేరి పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి. అయితే ఇలా పిల్లలు ఏదైనా వస్తువులను మింగితే చాలా కేసుల్లో లక్షణాలు కనిపిస్తాయి. దాన్ని వెంటనే గమనించి తల్లిదండ్రులు అప్రమత్తమై వైద్యులను సంప్రదించాల‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here