శేరిలింగంపల్లిలో వీధి దీపాల‌ను బాగుచేయాలి.. జోనల్ కమిషనర్‌కు సామెల్ కార్తీక్ వినతి

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బోనాలు, వినాయక చవితి, దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శేరిలింగంపల్లి డివిజన్‌లో వెలగని వీధి దీపాలను తక్షణమే మరమ్మత్తు చేసి కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేయాలని టీపీసీసీ కార్యదర్శి, కంటెస్టెడ్ కార్పొరేటర్ సామెల్ కార్తీక్ కోరారు. ఈ మేరకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయ‌ణ్ అమిత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి డివిజన్‌లో పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, లింగంపల్లి గ్రామం, గోపీ నగర్, నెహ్రూ నగర్, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో పనిచేయని వీధి దీపాలను మార్చి, అవసరమైన చోట కొత్త దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. పండుగల దృష్ట్యా మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సామెల్ కార్తీక్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వీధి దీపాల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీధి దీపాల మరమ్మత్తు పనులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పదేళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కనీస మౌలిక వసతులు కల్పించలేదని విమర్శించిన ఆయన, ప్రస్తుతం కొందరు ప్రచారం కోసం అధికారులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. గత పాలనపై అవగాహన లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ఆరోపణలు చేయడం వారి అమాయకత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుల వినతులను కూడా అధికారులు గౌరవంగా స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, ఇది ప్రజా పాలనకు నిదర్శనమని సామెల్ కార్తీక్ అన్నారు. ప్రజల కోసం అహంకారానికి దూరంగా పనిచేస్తున్న అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్య రాథోడ్, విద్యార్థి నాయకుడు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here