జ్యోతిష్యం పేరుతో చిలుక బంధనం.. రక్షించిన అటవీ శాఖ

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో జ్యోతిష్యం చెప్పేందుకు బంధించి ఉంచిన ఓ చిలుకను సిటిజన్స్ ఫర్ యానిమల్స్ (CFA) బృందం రక్షించింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో కుక్కలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో సీఎఫ్ఏ సభ్యులు చిలుకను జ్యోతిష్యం చెప్పేందుకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు తెలియజేయగా, వారు స్పందించి చిలుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ రక్షణ చర్యలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, అటవీ శాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్, అటవీ శాఖ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ సిబ్బంది సహకరించారు. సీఎఫ్ఏ సభ్యుడు రాకేష్ సంబంధిత వ్యక్తిపై అధికారిక ఫిర్యాదు నమోదు చేసి, చిలుకను తదుపరి సంరక్షణ, పునరావాసం కోసం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

యాంటీ పోచింగ్ స్క్వాడ్ ఇన్‌చార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బాలయ్య ఈ ఆపరేషన్‌ను సమన్వయం చేశారు. చిలుకను సురక్షితంగా అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం అడవి పక్షులను బంధించి ఉంచడం, వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం నేరమని అధికారులు గుర్తుచేశారు. వన్యప్రాణులను బంధించడం, విక్రయించడం లేదా దుర్వినియోగం చేస్తున్న ఘటనలు కనిపిస్తే అటవీ శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 5364కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here