శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): రోడ్ సేఫ్టీ మంత్ – 2026 సందర్భంగా మియాపూర్ పరిధిలోని కల్వరి చర్చ్ వద్ద అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీస్ మియాపూర్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చర్చ్‌కు వచ్చిన భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా పోలీసులు హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, అతివేగంగా వాహనం నడపకూడదని, తప్పుదారిలో వాహనం నడపడం వల్ల కలిగే నష్టాలు, అలాగే పాదచారులు రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. రోడ్డు నియమాలను పాటించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమం లక్ష్యం ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించడం, బాధ్యతాయుతమైన వాహన వినియోగ సంస్కృతిని ప్రోత్సహించడం, రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడం, విలువైన మానవ ప్రాణాలను రక్షించడం అని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని మియాపూర్ ట్రాఫిక్ స్టేషన్ ఎస్హెచ్ఓ తెలిపారు.





