శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్నం నూట యాభై మందికి పైగా భక్తులు అన్నదాన ప్రసాదం ద్వారా లబ్ధి పొందారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన అన్నమయ్య స్వరార్చన కార్యక్రమం సందర్భంగా తొలుత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమయ్య అష్టోత్తరం పారాయణ నిర్వహించగా, చిన్నారుల గురు స్తుతితో ప్రారంభించి శ్రీ కళ్యాణి మ్యూజిక్ అకాడమీ గురువులు బి.వి. రమణమూర్తి, బి. శారదా రమణమూర్తి మార్గదర్శకత్వంలో శిష్యులు రిషిక, రవితేజ, శారద, నిర్మల శ్రీ, దేవాన్షి, తీక్షిక సంయుక్తంగా సంకీర్తనలలో భాగంగా – చూడరమ్మ సతులాలా, జగడపు చనవుల జాజర, శిరుత నవ్వుల వాడు సిన్నెక్కా, గరుడ గమన, తందనానా.. అనే అన్నమయ్య సంకీర్తనలకు అద్భుత భావాన్ని అందించి, స్వామివారికి భక్తిపూర్వక స్వరసేవ చేశారు. కాగా, వీరికి తబలా మీద బి. వి. రమణమూర్తి, జగన్ దత్తు, వీణతో సుహాసిని, రత్న, కీ బోర్డ్ మీద రోహిత వాయిద్య సహకారం అందించారు.

కార్యక్రమం అనంతరం పద్మశ్రీ డా. శోభారాజు ఒక చక్కని అన్నమయ్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, స్వరార్చన గురించి మాట్లాడుతూ గురువులు బి.వి.రమణమూర్తి, బి. శారదా రమణమూర్తి తమ శిష్యులను సంగీతాన్ని భక్తి భావ సమన్వయంతో తీర్చిదిద్దుతున్న విధానం ప్రశంసనీయం అని కొనియాడారు. అన్నమాచార్య భావనా వాహిని పక్షాన కళాకారులకు సంస్థ వ్యవస్థాపకురాలు శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ కలిసి ప్రతి ఒక్కరికి జ్ఞాపికను అందించి ప్రశంసించారు. చివరగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో కార్యక్రమం భక్తిసంగీత మాధుర్యంతో విజయవంతంగా ముగిసింది.





