అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గత 5 ఐదు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వెల్లడించేందుకు, ఐదు సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా గౌలిదొడ్డిలోని గచ్చిబౌలి డివిజన్ వార్డ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఆశీర్వాదాలతో గెలిచి, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో సుమారు 90 శాతం పూర్తి చేయగలిగామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాల ద్వారా డివిజన్ పరిధిలోని అనేక మంది అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందించామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేశామని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

నేతాజీ నగర్, గుల్మోహర్ పార్క్, నల్లగండ్ల విలేజ్, నల్లగండ్ల హుడా కాలనీ, నవోదయ కాలనీ, గోపన్‌పల్లి, గోపన్‌పల్లి తండా, ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ, తాజ్ నగర్, గౌలిదొడ్డి, కేశవ్ నగర్, నానక్‌రామ్ గూడ, ఖాజా గూడ, ప్రశాంత్ హిల్స్, మధురా నగర్, రాయదుర్గం, గచ్చిబౌలి, టెలికం నగర్, జీపీఆర్‌ఏ క్వార్టర్స్, ఇందిరా నగర్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్, సెంట్రల్ లైటింగ్ వంటి మౌలిక వసతుల పనుల‌ను విస్తృతంగా చేపట్టి పూర్తి చేశామని తెలిపారు. డివిజన్ పరిధిలోని పార్కులను అభివృద్ధి చేసి, వాటిలో వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయడంతో పాటు, పచ్చదనం పెంచి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించామని తెలిపారు. అలాగే శ్మశానవాటికలను అభివృద్ధి చేసి సుందరీకరణ చేయడం జరిగిందని చెప్పారు. స్కూల్స్, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, ప్రహరీ గోడల నిర్మాణం ద్వారా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించామని పేర్కొన్నారు.

గోపన్‌పల్లి తండాలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, ఇది స్థానిక ప్రజలకు అనేక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడంతో పాటు, స్టేడియం పరిసరాల సుందరీకరణ పనులు చేపట్టామని వెల్లడించారు. అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేసి, ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. నల్లగండ్ల ప్రాంతంలో తీవ్రంగా ఉన్న డ్రైనేజీ సమస్యను తెల్లాపూర్ వైపు మళ్లించడం ద్వారా శాశ్వత పరిష్కారం చూపించామని తెలిపారు. గోపన్‌పల్లి, గోపన్‌పల్లి తండా, సాయి వైభవ్ కాలనీ, కేశవ్ నగర్, మధుర నగర్ ప్రాంతాల్లో 99 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలిన కొద్ది కాలనీల్లో కూడా త్వరలో పనులు చేపడతామని తెలిపారు.

ఖాజాగుడ స్టేడియంలో కొన్ని నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, అలాగే డంపింగ్ యార్డును షిఫ్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరలోనే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కౌన్సిల్‌లో చర్చించి అవసరమైన నిధులు తెప్పించి అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో మొత్తం రూ.920 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేయగలిగామని తెలిపారు. అన్ని పార్టీల సమన్వయం, అధికారుల అండదండలతో ఈ అభివృద్ధి సాధ్యమైందని, అందుకు సహకరించిన జోనల్ కమిషనర్‌తో పాటు అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు ఎల్లప్పుడూ సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీల‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల ఆదరాభిమానాలు తనపై ఉండటం తనకు గర్వకారణమని తెలిపారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షానే నిలబడతానని, భవిష్యత్తులో కూడా గచ్చిబౌలి డివిజన్‌ను మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నానని కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here