శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): యువశక్తి బలపడితేనే తెలంగాణ మరింత బలపడుతుంది. యువత చేతుల్లోనే తెలంగాణ రేపటి విజయగాథ ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కృష్ణ పటేల్ 54వ జయంతి సందర్భంగా శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో చైర్మన్ బాలరాజ్ ముదిరాజ్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివసేన రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ యువతలో అపారమైన ప్రతిభ, శక్తి, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ శక్తిని సరైన దిశలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, క్రీడల ప్రోత్సాహం, స్వయం ఉపాధి రంగాల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొంటూ, గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.






