హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): యావత్ భారత దేశానికి 15 ఆగష్టు 1947న స్వాతంత్య్రం వస్తే, తెలంగాణకి నిజమైన స్వాతంత్య్రం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు 17 సెప్టెంబర్ 1948 న వచ్చిందని హైదర్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, న్యాయవాది చిందం శ్రీకాంత్ పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిందం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో కొందరు నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ విద్రోహ దినంగా పేర్కొంటున్నారని, అది సరికాదని అన్నారు. ప్రజల మధ్య విభేదాలు పుట్టించి రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు అలా చేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటంలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకోని వారు నేడు దేశభక్తి పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బాలయ్య, ఎంఏ ఖదీర్, వెంకటేష్ యాదవ్, నర్సింగ్ రావు, దానయ్య, సత్యనారాయణ విష్ణు, ముజ్జు, సద్దాం, అనిల్, సత్తార్, అశోక్, మల్లేష్, వి.బి.చారి తదితరులు పాల్గొన్నారు.