శేరిలింగంపల్లి, మే 19 (నమస్తే శేరిలింగంపల్లి): ల్యాప్ టాప్ లను దొంగిలించాడనే ఆరోపణలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ పీజీ విద్యార్థి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ సౌత్ 24 పరగణాస్ జిల్లా, బారేపూర్‌కు చెందిన మయాంక్ కుందు(23) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎఫ్ హాస్టల్లోని రూమ్ నెంబర్ 242లో ఎంఏ సెకండ్ ఇయర్ విద్యార్థి సుప్రతి లోహాతో కలిసి ఉంటున్నాడు. రీడింగ్ రూమ్‌లో రెండు ల్యాప్‌టాప్ లు చోరీ చేశాడని ఆరోపిస్తూ ఇద్దరు లైఫ్ సైన్స్ విద్యార్థులు ఈ నెల 17న యూనివర్సిటీ యాజమాన్యానికి మయాంక్ పై ఫిర్యాదు చేశారు. ల్యాప్‌టాప్‌లు తీసి ఉంటే తిరిగి ఇవ్వాలని విద్యార్థులు కోరారు. ఆ ల్యాప్ టాప్ ల విషయం తనకు తెలియదని చెప్పాడు. ల్యాప్ టాప్ లను ఇవ్వక పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ క్రమంలో మనస్థాపం చెందిన మయాంక్ రూమ్ మేట్‌కు చెప్పకుండా సోమవారం తెల్లవారు జామున 4 గంటలకు హాస్టల్ నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ల్యాప్ టాప్ లు పోయాయని లైఫ్ సైన్స్ విద్యార్థులు సోమవారం ఉదయం గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. హాస్టల్ నుంచి వెళ్లిన మయాంక్ కుందు యూనివర్సిటీ క్యాంపస్ లోని బఫెల్లో లేక్ దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చెరువులో మయాంక్ మృతదేహాన్ని గుర్తించారు. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య మయాంక్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

డ్రగ్స్ కు బానిసై..
డ్రగ్స్ కు బానిస కావడంతోనే కొన్ని సార్లు ల్యాప్‌టాప్‌లు తస్కరించానని మయాంక్ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో యూనివర్సిటీలో విద్యార్థుల ల్యాప్‌టాప్‌లు మాయం కాగా సెటిల్మెంట్ చేసుకున్నట్లు నోట్‌లో వెల్లడించినట్లు తెలిపారు. ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ల విషయం మాత్రం తనకు తెలియదని తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ మూలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల పాలైనట్లు మయాంక్ పేర్కొనడం గమనార్హం.





