శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మొబిలిటీ సింపోజియం–2026లో చర్చ జరిగింది. బెంగళూరులో నిర్వహించిన ఈ సదస్సులో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన పాల్గొన్నారు. Resilient Mobility – Readying Indias Cities for an Uncertain World అనే అంశంపై నిర్వహించిన ప్యానెల్ చర్చలో గ్రేటర్ బెంగళూరు అథారిటీ చీఫ్ కమిషనర్, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌తో కలిసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పట్టణ ప్రజా రవాణా సామర్థ్యం, భవిష్యత్ అవసరాలు, స్థిరమైన పట్టణ చలనశీలతపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంపై ప్రధానంగా చర్చ జరిగింది. బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థల విస్తరణతో పాటు నడక, సైక్లింగ్ మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ రవాణా మార్గాల మధ్య సమన్వయం, ఫస్ట్ మైల్–లాస్ట్ మైల్ కనెక్టివిటీ వంటి అంశాలపై నగరాల అనుభవాలను అధికారులు పంచుకున్నారు. కేవలం రవాణా మౌలిక వసతులను విస్తరించడం మాత్రమే కాకుండా.. ప్రజలు తమ ఇళ్ల నుంచి కార్యాలయాలు, ఇతర గమ్యస్థానాలకు చేసే రోజువారీ ప్రయాణాన్ని మరింత సులభంగా, విశ్వసనీయంగా, అందుబాటులో ఉండేలా, ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా ప్రజా రవాణా వ్యవస్థలను రూపొందించాల్సిన అవసరం ఉందని చర్చించారు. అదేవిధంగా బస్సు సేవలను మరింత సమర్థవంతంగా, విశ్వసనీయంగా మార్చడం, నడక–సైక్లింగ్ మౌలిక వసతులను మెరుగుపరచడం, మెట్రో, సబర్బన్ రైలు, బస్సు వ్యవస్థల విస్తరణలో ఎదురయ్యే సవాళ్లపైనా ప్యానెల్లో చర్చించారు.
నగరాల అభివృద్ధికి అనుగుణంగా ప్రజా రవాణా సామర్థ్యాన్ని వేగంగా పెంచేందుకు ప్రభుత్వాలు, సంస్థలు, కార్పొరేట్ రంగం, పౌరుల భాగస్వామ్యం కీలకమని సింపోజియంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వివిధ నగరాల అనుభవాలు, ఆలోచనలను పరస్పరం పంచుకునేందుకు మొబిలిటీ సింపోజియం–2026 వేదికగా నిలిచింది.





