శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జిల యజమానులు, మేనేజర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. లాడ్జిల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. లాడ్జిల్లో బస చేసే ప్రతి వ్యక్తి గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించి, వారి పూర్తి వివరాలను నమోదు చేయాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. అలాగే లాడ్జిల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, లాడ్జి ప్రాంగణంలోని ముఖ్యమైన ప్రాంతాలు పూర్తిగా కవర్ అయ్యేలా కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని ఆదేశించారు.

మైనర్లు, అనుమానాస్పద వ్యక్తులకు నిబంధనలకు విరుద్ధంగా గదులు కేటాయించరాదని, లాడ్జిల్లో మాదకద్రవ్యాల వినియోగం, వ్యభిచారం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదని పోలీసులు హెచ్చరించారు. లాడ్జిల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా యజమానులు, మేనేజర్లు అప్రమత్తంగా ఉండాలని, నేరాల నియంత్రణలో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.





