శేరిలింగంపల్లి, అక్టోబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): గాజులరామారం సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌తో పాటు ఇంజినీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎస్డబ్ల్యూఎం), టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మల్లారెడ్డి ఆసుపత్రి నుంచి పెద్ద చెరువు వరకు చేపడుతున్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి, నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గాజులరామారం జంక్షన్ నుంచి మహాదేవపురం జంక్షన్ వరకు ప్రతిపాదించిన రోడ్డు విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాల తరలింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, ఎలాంటి జాప్యం లేకుండా పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆల్విన్ కాలనీలోని మహాదేవపురం జంక్షన్ నుంచి సిఖ్ బస్తీ వరకు కొనసాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ఆక్రమణలను గుర్తించి తొలగించేలా చర్యలు చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. పనుల పురోగతిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, అన్ని అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.





