శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): లింగంపల్లి రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి లభ్యమైంది. రైలులో తరలిస్తున్న సుమారు 10 కిలోల గంజాయిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న అబ్దుల్ జబ్బార్ అన్సారీ (35) పట్టుబడ్డాడు. అతడి వద్ద ఉన్న సుమారు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎక్కడికి తరలిస్తున్నాడు? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.






