శేరిలింగంపల్లి, అక్టోబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ సమీపంలో ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్నారని మిద్దెల మల్లారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్వే నంబర్లు 100, 101లో దాదాపు 200 గజాల స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ నిర్మాణంపై రెవెన్యూ శాఖకు చెందిన కిందిస్థాయి అధికారికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మిద్దెల మల్లారెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు ఫిర్యాదులు అందిన తర్వాత కూడా స్పందించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై మియాపూర్ తహసీల్దార్ మహిపాల్ రెడ్డి స్వయంగా స్థలాన్ని పరిశీలించి, అక్రమ నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సంబంధిత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, నిర్మాణానికి సంబంధించిన అనుమతులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నట్లు తేలితే వెంటనే వాటిని నిలిపివేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.





