చందానగర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేశ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ, మెన్స్ బ్యారక్, క్రైమ్ స్టేషన్, డీఐ రూమ్, సైబర్ క్రైమ్ వర్క్‌స్టేషన్, సీసీటీఎన్‌ఎస్ విభాగం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల (ఐఓలు) వర్క్‌స్టేషన్లు, రైటర్ల విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

ప్రతి విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి దైనందిన విధులు, పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు వర్కింగ్ డెమోలను వీక్షించారు. విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, రోజువారీ ఇబ్బందులపై వారితో చర్చించారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న డబ్ల్యూపీసీలు సరస్వతి, అరుణ, ఏఎస్ఐ యాదమ్మ, ఎస్ఐ సంధ్య రాధికలను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.

స్టేషన్‌కు ఫిర్యాదుల కోసం వచ్చిన సైబర్ క్రైమ్ బాధితులతోనూ డాక్టర్ ఎం. రమేశ్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులకు తక్షణమే స్పందించి చురుగ్గా సహాయం అందించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. అందుబాటులో ఉన్న పోలీస్ వాహనాలను అవసరమైన సమయాల్లో సకాలంలో వినియోగించుకోవాలని సూచించారు. రక్షక్ యాప్ పనితీరు, దాని వినియోగంలో సిబ్బంది అనుసరిస్తున్న విధానాలను కూడా సమీక్షించారు. ఈ తనిఖీలో ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్ కుమార్, చందానగర్ ఎస్‌హెచ్‌ఓ ఎ. శ్రీధర్ కుమార్, డీఐ పి. నవీన్ కుమార్, ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here