ఆదిత్యనగర్‌లో నివాసాల మధ్య ఎస్టీపీల నిర్మాణం నిలిపివేయాలి.. కమిషనర్‌కు రవికుమార్ యాదవ్ వినతి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని ఆదిత్యనగర్ కాలనీలో నివాస సముదాయాల మధ్య చేపడుతున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణాలను నిలిపివేసి, ప్రత్యామ్నాయ స్థలాల్లో ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రవికుమార్ యాదవ్ కోరారు. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనను కలిసి కాలనీవాసులతో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సీతారామరాజు ఆధ్వర్యంలో కాలనీ ప్రతినిధులు కమిషనర్‌ను కలిసి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. నివాస గృహాల మధ్య ఎస్టీపీల నిర్మాణం చేపట్టడం వల్ల దుర్వాసన వ్యాపించడంతోపాటు దోమలు, కీటకాల బెడద పెరిగి ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని రవికుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎస్టీపీలను ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రజారోగ్యం, స్థానికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేసి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపై కమిషనర్ సృజన సానుకూలంగా స్పందించారు. సమస్యను పరిశీలించి, కాలనీవాసులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిత్యనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు వెంకటరెడ్డి, భరత్, సీతారామరాజు, మహేష్ యాదవ్‌తో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here