స‌గర సంఘం భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులపై వినతి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్‌లో స‌గర (ఉప్పర) సంఘం భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ సంఘం ప్రతినిధులు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్‌లను కలిసి వినతిపత్రాలు అందజేశారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకుడు బోయిని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స‌గర సంఘం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా సంఘ భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు వివరించారు. భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కోరారు.

వినతిపై స్పందించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. నిబంధనలు, అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా ఎంపీ ల్యాడ్స్ ద్వారా సహాయం అందించే అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు, సంఘ భవన నిర్మాణానికి తన వంతుగా వ్యక్తిగత ఆర్థిక సహాయం అందిస్తానని రవికుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. సంఘ భవనం నిర్మాణం పూర్తయితే స‌గర సంఘం సభ్యులతోపాటు స్థానిక ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ప్రతినిధులు పేర్కొన్నారు. తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స‌గర సంఘం గౌరవ అధ్యక్షుడు మెడల గోవర్ధన్ సాగర్, అధ్యక్షుడు శ్రీనివాసులు సాగర్, భీమ్ సేన్ సాగర్, ఆలేటి మూర్తి సాగర్, చిన్న రాయుడు సాగర్, శేఖర్ సాగర్, శ్రీనివాస్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here