- చందానగర్ లో ఘనంగా శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం
శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): దశాబ్దాలుగా శేరిలింగంపల్లి జర్నలిస్టులు ఎదురుచూస్తున్న సొంతింటి కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయని టియుడబ్ల్యూజే నాయకులు తెలిపారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంలో సోమవారం శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టియుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పైళ్ల విఠల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సగరలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అండదండలతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో చందానగర్ లో శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం 1 ఎకరా స్థలాన్ని కేటాయించిందని అన్నారు. సదరు స్థలంలో జర్నలిస్టులకు సొంతింటి కలను సాకారం చేసేందుకు టియుడబ్ల్యూజే, ప్రెస్ క్లబ్ ల ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

శేరిలింగంపల్లిలో జర్నలిస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా ఈ స్థలం పక్కనే ఉన్న మరో ఎకరా స్థలం మంజూరు కోసం ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. శేరిలింగంపల్లిలో పనిచేస్తున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగే విధంగా టీయూడబ్ల్యూజే కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించిన ఘనత తమదని.. ఎక్కడా లేని విధంగా అక్రిడేషన్ కార్డులను పెంచి వర్కింగ్ జర్నలిస్టులకు గుర్తింపు కార్డులను అందజేశామని అన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కాలపరిమితి ముగిసి 20 నెలలు గడుస్తున్నా రెన్యువల్ చేయడం లేదని వాపోయారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం టియుడబ్ల్యూజే ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. శేరిలింగంపల్లిలో పనిచేస్తున్న జర్నలిస్టులందరినీ సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.






