- స్వామి వారికి ఘనంగా అష్టోత్తర శత కలశాభిషేకం
- ఇరుదేవేరులతో చందానగర్ పురవీధుల్లో ఊరేగిన శ్రీవారు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లోని విశాఖ శ్రీ శారద పీఠపాలిత శ్రీ వేంకటేశ్వరాలయ సముదాయంలో శ్రీవారి 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు మూడవ రోజు వైభవంగా కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు, శారదా పీఠం రాష్ట్ర ఆగమ సలహాదారు శ్రీ సుదర్శనం సత్యసాయి పర్యవేక్షణలో సోమవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం ఆలయ మహారాజ పోషకులు కలిదిండి సత్యనారాయణరాజు ఝాన్సీలక్ష్మి దంపతులచే ఐశ్వర్య హోమం జరిపించారు.
రాత్రి వేళ పద్మావతి గోదాదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి చందానగర్ పురవీధుల్లో సింహవాహనంపై ఊరేగారు. దారిపొడవునా భక్తులు ఉత్సాహంగా శ్రీవారికి అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. పుష్పాలంకరణ సేవలో సంపత్ కుమార్, సింహవాహన సేవలో సీతామహాలక్ష్మి, అరుణ కుమారి, ధర్మ తదితర భక్తులు భాగస్వామ్యం అయ్యారు. ఆలయ పాలకమండలి సభ్యులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.