కొండాపూర్‌లో కన్నులపండువగా శ్రీ జగన్నాథ రథయాత్ర

శేరిలింగంప‌ల్లి, జూలై 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో శ్రీ జగన్నాథ రథయాత్రను ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బంజారాహిల్స్ ఇస్కాన్ టెంపుల్, హరే కృష్ణ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకకు తెలంగాణ యాదవ కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ ప్రత్యేక పర్యవేక్షణ వహించారు. ఈ రథయాత్రలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ జగన్నాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ సమాజంలో భక్తి భావాన్ని, సామరస్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. హరినామ సంకీర్తనలు, భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీ జగన్నాథుడి రథం కొండాపూర్ వీధుల్లో ముందుకు సాగగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు, హరే కృష్ణ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here