మల్కం చెరువులో స్వయంగా క్రేన్‌పై వెళ్లి గణనాథుడిని నిమజ్జనం చేసిన నారాయణ్ అమిత్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా జోనల్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, బుధవారం నిమజ్జన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కార్యాలయ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల సిబ్బంది, కాంట్రాక్టర్లు, కార్మికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య గణేష్ విగ్రహాన్ని ఊరేగింపుగా మల్కం చెరువు వద్దకు తీసుకెళ్లారు.

మల్కం చెరువు వద్ద గణేష్ నిమజ్జనం సందర్భంగా జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ స్వయంగా క్రేన్‌పై వెళ్లి గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అధికారి హోదాలో ఉన్నప్పటికీ స్వయంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం అక్కడున్న అధికారులు, సిబ్బంది, భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నారాయణ్ అమిత్ మాట్లాడుతూ.. వినాయక చవితి ఐక్యత, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అధికారులు, సిబ్బంది అందరూ కలిసి కుటుంబ సభ్యుల్లా పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. నగర అభివృద్ధితో పాటు ప్రజల సుఖసంతోషాలకు విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు, ఈఈలు, ఏఈలు, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here