శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు నిర్విఘ్నంగా పూజలందుకున్న గణనాథుడిని పదో రోజు నిమజ్జనం కోసం శోభాయాత్రగా తరలించారు. ఈ క్రమంలో శివరాంపల్లిలోని గాయత్రీ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సతీసమేతంగా, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వేషధారణలతో ప్రత్యేకంగా అలంకరించిన గణనాథుడిని పత్తికుంటకు తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ వై. శ్రీధర్, డివిజన్ కన్వీనర్ జి. బాబురావు ఘనంగా స్వాగతం పలికారు. రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్‌తో పాటు ఆదిలాబాద్ రెండో బెటాలియన్ నుంచి బందోబస్తు కోసం వచ్చిన అడిషనల్ కమిషనర్ జయప్రకాశ్ నారాయణ్, జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా గణనాథుడికి స్వాగతం పలికారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.





