ఓయో హత్య కేసులో కీలక వివరాలు.. మృతురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌లో చోటుచేసుకున్న ఓయో రూమ్‌ హత్య కేసులో మృతురాలు షారోన్‌ నికిత కుటుంబ సభ్యులు బుధవారం ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రికి చేరుకున్నారు. జార్ఖండ్‌ నుంచి వచ్చిన ఆమె తల్లిదండ్రుల సమక్షంలో మృతదేహానికి ఇన్‌క్వెస్ట్‌, పోస్టుమార్టం ప్రక్రియలను పోలీసులు పూర్తి చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె తండ్రి మైఖేల్‌ టోప్నేకు అప్పగించారు. అనంతరం అంత్యక్రియల కోసం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా మృతురాలి తండ్రి మైఖేల్‌ టోప్నే పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. షారోన్‌ నికిత, నిందితుడు శ్రీనివాస రవి తేజ గతంలో ప్రేమ సంబంధంలో ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత వారి మధ్య చోటుచేసుకున్న పరిణామాల గురించి తనకు తెలియదని, ఘటనకు ముందు అసలు ఏం జరిగిందనే విషయంపై కూడా తనకు స్పష్టమైన సమాచారం లేదని పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు ముందు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై అందుబాటులో ఉన్న ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్‌, టెక్నికల్‌ ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను సేకరించి ఘటనకు సంబంధించిన క్రమాన్ని నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు.

నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు.. అతడిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తులో వాస్తవాలు నిర్ధారించిన అనంతరం తదుపరి వివరాలను వెల్లడిస్తామని మాదాపూర్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here