శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలో వినాయక నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈదమ్మ పోచమ్మ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్రను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్, గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించే గొప్ప వేడుకలని అన్నారు. గణపయ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు.

గణపయ్య నిమజ్జనం ముగింపు కాదు.. కొత్త ఆరంభానికి సంకేతం అని వారు పేర్కొన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలు తొలగి, కొత్త ఆశలు, విజయాలకు మార్గం సుగమం కావాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో సాగిన నిమజ్జన శోభాయాత్రలో గణేష్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ నినాదాలతో గోపనపల్లి తండా సందడిగా మారింది. మహిళలు, చిన్నారులు, యువత, కాలనీ వాసులు, కార్యకర్తలు, గణేష్ మండపాల నిర్వాహకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






