శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోని లెగసీ వ్యర్థాలు, నిర్లక్ష్యంగా పేరుకుపోయిన చెత్తను వేగంగా తొలగించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌డబ్ల్యూ లిమిటెడ్ (హిమ్స్‌డబ్ల్యూ) సహకారంతో బియాండ్ రొటీన్ – ఎక్స్‌ట్రా అవర్ సర్వీస్ పేరుతో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. సీఎంసీ అదనపు కమిషనర్ (పారిశుధ్యం) వేణుగోపాల్ రెడ్డి టిప్పర్ వాహనాలు, లోడింగ్ యంత్రాలను జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాధారణ పారిశుధ్య సేవలకు అదనంగా ప్రత్యేక సిబ్బంది, యంత్రాలను వినియోగించి చాలా కాలంగా పేరుకుపోయిన లెగసీ వ్యర్థాలు, రహదారుల పక్కన, ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్త కుప్పలను తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

మొదటి దశలో కూకట్‌పల్లి జోన్ పరిధిలోని శ్రీలా పార్క్ ప్రైడ్ రోడ్ వద్ద లెగసీ వ్యర్థాల తొలగింపు చేపట్టారు. గుర్తించిన అన్ని లెగసీ వ్యర్థాల ప్రాంతాలను దశలవారీగా శుభ్రం చేస్తూ ఈ కార్యక్రమాన్ని కార్పొరేషన్ పరిధిలోని అన్ని జోన్‌లకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రహదారుల పక్కన, ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా ప్రజలు, వాణిజ్య సంస్థలు, వీధి వ్యాపారులు సహకరించాలని కోరారు. ఇంటి వద్దే తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి అధీకృత ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకే అందించాలని విజ్ఞప్తి చేశారు. చెత్త పారబోయడాన్ని అరికట్టేందుకు నిఘాను మరింత బలోపేతం చేయడంతో పాటు నో బిన్ – నో ట్రేడ్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. వాణిజ్య సంస్థలు తప్పనిసరిగా చెత్త బుట్టలు ఏర్పాటు చేసి శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణను పాటించాలని సూచించారు.
పరిశుభ్రమైన సైబరాబాద్ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి పౌరుడు, ప్రతి వాణిజ్య సంస్థ వ్యర్థాలను మూలంలోనే వేరు చేసి అధీకృత వాహనాలకే అందించాలని, లెగసీ వ్యర్థాల తొలగింపుతోపాటు చెత్త పారబోయడంపై కూడా కార్పొరేషన్ కఠిన చర్యలు కొనసాగిస్తుందని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌డబ్ల్యూ లిమిటెడ్ ప్రతినిధులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.





