హఫీజ్‌పేట్ రేగుల కుంట భూ వివాదం: ఏడీ నివేదికపై కలెక్టర్‌కు ఫిర్యాదు.. అవినీతి అధికారుల సస్పెన్షన్‌కు డిమాండ్

శేరిలింగంప‌ల్లి, జూలై 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ దీప్తిశ్రీనగర్‌లోని రేగుల కుంట భూమి విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (AD) కార్యాలయం ఇచ్చిన నివేదికపై జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఏడీ రాంరెడ్డిని స్వయంగా కలిసి ఆధారాలను సమర్పిస్తూ, చెరువు భూమి కబ్జాకు అనుకూలంగా నివేదిక ఇచ్చారని ఆరోపించారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా పేరుతో వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే, కొందరు అవినీతి అధికారులు ఆ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. 2020లో అప్పటి రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ ఆదేశాల మేరకు నిర్వహించిన సర్వేలో సర్వే నంబర్ 151 ప్రభుత్వ సర్కారీ చెరువుగా గుర్తించారని తెలిపారు.

అలాగే 2026లో శేరిలింగంపల్లి తహసీల్దార్ మహిపాల్ రెడ్డి ఆదేశాలతో మండల సర్వేయర్ నిర్వహించిన తాజా సర్వేలో కూడా సర్వే నంబర్ 151 ప్రభుత్వ చెరువేనని తేలిందని చెప్పారు. ఈ రెండు సర్వేలకు సంబంధించిన ఆధారాలను కలెక్టర్ కార్యాలయం, ఏడీ కార్యాలయానికి సమర్పించినట్లు వెల్లడించారు. అయితే, ఏడీ కార్యాలయంలోని అధికారులు అకస్మాత్తుగా సర్వే నంబర్‌ను 151 నుంచి 150గా మార్చి, అది చెరువు కాదన్నట్లుగా నివేదిక ఇచ్చి భూ కబ్జాకు సహకరిస్తున్నారని కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి సంబంధిత అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జనం కోసం సంస్థ సమర్పించిన ఫిర్యాదును ఏడీ రాంరెడ్డి స్వీకరించి, సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రేగుల కుంట చెరువు పరిధిలో కొనసాగుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, శేరిలింగంపల్లి తహసీల్దార్ కఠిన చర్యలు తీసుకోవాలని కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here