నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జోనల్ కమిషనర్ శంకరయ్యకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శంకరయ్యను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కలిసి సమస్యలను వివరించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి, రాయదుర్గం, నల్లగండ్ల హుడా, మంజీరా డైమండ్ టవర్స్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్య, నీటి సమస్యలతో పాటు సీసీ రోడ్డును నిర్మించేలా చూడాలని కోరారు.

మంజీరా డైమండ్ టవర్స్ లో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. పలు సమస్యలపై జోనల్ కమిషనర్ శంకరయ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై, చేపట్టవలసిన, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చర్చించారు. పెండింగులో ఉన్న పనులను వెంటనే ప్రారంభించి త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో డీఈ విశాలాక్షి, ఏఈ సునీల్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి తదితరులు పాల్గొన్నారు.
