నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్మాల్ ఆండ్ మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ చాంబర్స్ ఆఫ్ కామర్స్(ఎస్ఎంఈసీసీ) తెలంగాణ ప్రాంత కార్యాలయ ప్రారంభోత్సవం ఎల్‌బీనగర్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజాంపేట ప్రాంతానికి చెందిన ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త, తెలంగాణ రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల ఉపాధ్యక్షురాలు విష్ణు ప్రియ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్ఎంఈసీసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభసూచకమని అన్నారు. చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు, కొత్తగా వస్తున్న ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తలకు ఇక్కడ ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వారికి కేంద్ర ప్రభుత్వం తక్కువ వడ్డీతో రుణ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని యువ పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.