నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో అత్యంత వెనుకబడిన ప్రతి ఎంబిసి కుటుంబానికి ఎంబిసి బంధు పథకం ద్వారా రూ. 10 లక్షలు ఇవ్వాలని తెలంగాణ ఎంబిసి సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెక్కం వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బెక్కంవెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన బీసీలు ఆదినుండి నేటి వరకు వివక్షకు గురవుతూ రాజ్యాధికారానికి దూరమవుతున్నారన్నారు. అందులో ఎంబిసి సంచార కులాలకు సంబంధించిన చాలా కులాలు వెనుకబాటుతనంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలనే సంకల్పంతో దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దళితబంధు మాదిరిగానే వెనుకబాటుతనానికి గురవుతూ సమాజానికి ఆమడ దూరంలో నివసిస్తున్న అత్యంత వెనుకబడిన కులాలు, సంచార కులాలకు ఎంబిసి బంధు పథకం ప్రవేశపెట్టి, వెంటనే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దళిత బందు పథకాన్ని కేవలం హుజురాబాద్ నియోజకవర్గం, వాసాలమర్రి గ్రామంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి అందేలా చూడాలని అన్నారు. గిరిజనుల కోసం గిరిజన బంధు పథకాన్ని తీసుకువచ్చి, ప్రతి గిరిజన కుటుంబానికి రూ. 10 లక్షలను ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన బడుగు బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా, మరిన్ని సంక్షేమ పథకాలను ,రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలకు నామినేటెడ్ పోస్టుల్లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వెంకట్ కోరారు.