మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రముఖ చారిత్రక నవలా రచయిత డాక్టర్ ముదిగొండ శివ ప్రసాద్ తాను రాసిన సత్యమేవ జయతే అనే రెండు భాగాలతో కూడిన 1000 పేజీల గ్రంథాన్ని భారతీయం సత్యవాణి దంపతులకు అంకితమిచ్చారు. ఈ సందర్భంగా శివప్రసాద్ శుక్రవారం తన భార్య, రచయిత్రి ఉమాదేవి వర్ధంతి సందర్భంగా తన కుమార్తె సుష్మతో కలిసి సత్యవాణి నివాసానికి వెళ్లి ఆమెకు గ్రంథాన్ని అందజేశారు. అనంతరం ఆమెను శివ ప్రసాద్ సన్మానించారు.

ఈ సందర్బంగా శివ ప్రసాద్ మాట్లాడుతూ పుస్తకాన్ని సభా ముఖంగా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ఆవిష్కరిద్దామనుకున్నానని, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆ పనిచేయలేకపోతున్నందుకు విచారంగా ఉందన్నారు. సత్యమేవ జయతే గ్రంథంలో వేదాలలోని మూలాలను, ఇంకా అనేకానేక విషయాలను పరిశోధించి అందజేయడం జరిగిందన్నారు. ఆర్ష సంస్కృతి కోసం పాటుపడుతున్న భారతీయం సత్య వాణికి ఈ గ్రంథాన్ని అంకితం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా శివ ప్రసాద్‌ను సత్యవాణి సన్మానించారు. ఈ తరం వారికి తెలియని ఎన్నో అనేక విషయాలను ఈ గ్రంథంలో ప్రస్తావించడం జరిగిందని, ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం కూడా ఈ గ్రంథంలో దొరుకుతుందని ఆమె వెల్లడించారు. ఇది అందరూ చదవదగిన గ్రంథమని అన్నారు.





